Special Trains: ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్- పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింతగా పెరిగిపోయాయి. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ దాడులు జరిపింది. దాడుల్లో జైషే మహ్మద్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన 100 మందికి పైగా ముష్కరులు హతమయ్యారు. దాడులకు ప్రతిచర్యగా పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో భారత్ పై విరుచుకుపడుతోంది. దాడులను భారత్ క్షిపణి రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది.
గత రాత్రి జమ్మూలో పలు ప్రాంతాలపై పాకిస్తాన్ దాడులుల చేసింది. అలాగే పంజాబ్, రాజస్థాన్ లోనూ దాడులు చేస్తోంది. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కాల్పుల్లో 16 మంది అమయాక పౌరులు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని, ఎవరూ బయటకు రావొద్దని ఆర్మీ హెచ్చరికలు జారీ చేసింది.
ఇదిలా ఉండగా.. జమ్మూ కాశ్మీర్ లో చిక్కుకుపోయిన పర్యాటకులను తరలించేందుకు ఇండియన్ రైల్వేస్ 3 స్పెషల్ ట్రైన్స్ ఏర్పాటు చేసింది. జమ్మూ, ఉదంపూర్ నుంచి మూడు రైళ్లను ఢిల్లీకి నడపనున్నారు. భద్రతా సమస్యలు పెరగడంతో ప్రజల డిమాండ్ మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. రైలు నెంబర్ 04612 రైలు 12 అన్ రిజర్వ్, 12 రిజర్వ్ కోచ్ లతో నడుస్తుంది. ఉదయం 10.45 గంటలకు జమ్మూ నుంచి బయల్దేరుతుంది.
వందే భారత్ రైలు మధ్యాహ్నం 12.45 గంటలకు ఉదంపూర్ నుంచి బయలుదేరి జమ్మూ, పఠాన్ కోఠ్ మీదుగా ఢిల్లీ చేరుకుంటుంది. మరోరైలు సాయంత్రం 7 గంటలకు జమ్మూ నుంచి బయల్దేరుతుంది. ఈ రైలులో అన్నీ రిజర్వ్ కోచ్ లు ఉంటాయి. మరో రైలు కూడా సాయంత్రం 7 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతుంది. ఈ రైళ్లలో పర్యాటకులను తరలించాలని రైల్వే నిర్ణయించింది.